Nanna Enduko Venakapaddadu

అమ్మ తొమ్మిది నెలలు మొస్తే ….నాన్న పాతికేళ్ళు మోస్తాడు
రెండు సమానమే అయినా…నాన్న ఎందుకో వెనకబడ్డాడు
ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ …
తన జీతం అంతా ఇంటికే ఖర్చుపెడుతూ నాన్న …
ఇద్దరి శ్రమ సమానమే అయినా….నాన్న ఎందుకో వెనకబడ్డాడు
ఏది కావాలి అంటే అది వండిపెడుతూ అమ్మ …
ఏది కావాలి అంటే అది కొనిపెడుతూ నాన్న …..
ఇద్దరి ప్రేమ సమానమే ఐన, నాన్న కి వచ్చిన పేమ ముందు …

నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు ….

ఫోన్లోనూ అమ్మ పేరే….దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే …
అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు…
నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా??
ఇద్దరు సమానమే అయినా …పిల్లల ప్రేమ పొందడం లో తర తరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు …
అమ్మకి మాకు బీరువా నిండా రంగు రంగుల చీరలు బట్టలు …..
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు….
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న …..
ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు ….
అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు ….
నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి ….
కుటుంబం కోసం ఎంత చేసినా… తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు …
పిల్లలకి ఫీస్లు ఖర్చులు ఉన్నాయ్ అప్పుప్పుడు …
ఈసారి పండగకి చీర కొనద్దు అనింది అమ్మ ….
ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ….
ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టం గా తిని నాన్న …
ఇద్దరి ప్రేమ ఒకటే అయినా… మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు
వయసు మళ్ళాక … అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది …
నాన్న ఎందుకూ పనికిరాడు అని మేము తీర్మానం చేస్కున్నపుడు కూడా ….వెనుకబడింది నాన్నే
నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం…ఆయన మా అందరికి వెన్నెముక కావడమే
వెన్నెముక వెనక ఉండబట్టే కదా…. దన్ను గా నిలబడగలుగుతున్నాం

ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll Up